దేశ వ్యాప్తంగా కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాధి విషయంలో ఎక్కడ ఏ అనుమానం ఉన్నా సరే ఏ మాత్రం అలసత్వం వహించడం లేదు ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తుంది. పలు విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించి వైద్య పరిక్షలు జాగ్రత్తగా చేస్తూ వస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నేపధ్యంలో చైనా సహా కొన్ని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరిక్షలు చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. మంత్రి ఈటెల రాజేంద్ర ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఎప్పటికప్పుడు తెలంగాణా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది.
ఇదిలా ఉంటే గాంధీ ఆస్పత్రిలో పరిక్షల కోసం సెంటర్ ఏర్పాటుకి కేంద్రం అంగీకరించింది. దీనితో నమూనాలను ప్రతీసారి పూణేకి పంపకుండా గాంధీ ఆస్పత్రిలోనే పరిక్షలు జరపవచ్చు. ఒకే కుటుంబంలో ముగ్గురుకి కరోనా లక్షణాలు కనపడటంతో వారి నమూనాలను పూణే పంపించారు అధికారులు. అయితే దీనిపై తప్పుడు ప్రచారం నమ్మవద్దని తెలంగాణా ప్రభుత్వం సూచిస్తుంది. మనకు వచ్చే అవకాశాలు తక్కువ అని వచ్చేది వేసవి కాలమని మంత్రి ఈటెల చెప్పారు.