నీట్‌ పీజీ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు.. వార్తల్ని నమ్మొద్దంటూ కేంద్రం క్లారిటీ

-

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష- 2023(NEET PG 2023) తేదీని మార్చాలంటూ డిమాండ్లు వస్తోన్న వేళ  ఆ పరీక్షను రీషెడ్యూల్‌ చేసినట్టుగా జరుగుతోన్న దుష్ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. అదంతా ఫేక్ న్యూస్ అని ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది. మార్చి 5న జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షలో మార్పులు జరిగాయని.. మే 21కి మార్పు చేసినట్టు పేర్కొన్న ఆ నోట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘‘నీట్‌ పీజీ2023 పరీక్షను రీషెడ్యూల్‌ చేసినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందేశం సర్క్యులేట్‌ అవుతోంది. అది ఫేక్‌ సందేశం. ఇలాంటి నకిలీ సందేశాలను ఇతరులకు షేర్‌ చేయొద్దు’’ అని ట్విటర్‌లో కోరింది.

ఇంకోవైపు, నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్(FAIMA) బృందంతో పాటు నీట్‌ పీజీ ఆశావహులు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మంగళవారం నిరసనకు దిగారు.  ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5న కాకుండా మే లేదా జూన్‌ నెలల్లో పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు చదువుకొనేందుకు సమయం దొరకడంతో పాటు ఎలిజిబిలిటీ విషయంలో ఇంటర్న్‌షిప్‌లో ఉన్నవారికి లబ్ది చేకూరుతుందని వైద్య సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news