కేంద్ర ప్రభుత్వం ఓటిటి నియంత్రణకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఓటిటి నియంత్రణ మూడు అంచెల విధానం అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఓటిటి లో ఐదు అంశాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం విధిస్తున్నామని అన్నారు. వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన చేస్తామన్న ఆయన సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు.
అలానే సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాల పై కూడా నిషేధం ఉండటుందని అన్నారు. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్స్ పై నిషేధాజ్ఞలు ఉంటాయని ఆయన అన్నారు. జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై కూడా నిషేధం కొనసాగనుంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై నియంత్రణ విధించనున్నారు.