గే వివాహాల అంశం.. రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం

-

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్రం ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉంది. ఈ అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ పెళ్లిళ్లకు గుర్తింపునివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకున్న విచారణార్హతపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. ఈ కేసులో అనుకూల, ప్రతికూల వాదనలను తొలుత వింటామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఇవాళ కేంద్రం తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రస్తుత విచారణలో భాగస్వాములను చేయాలని అందులో సుప్రీంను కోరింది. స్వలింగ వివాహాలపై చర్చ రాష్ట్రాల శాసనసభ పరిధిలోకి వస్తుందని, అందుకే అవి విచారణలో భాగం కావాలని తన వాదన వినిపించింది. అలాగే దీనిపై పది రోజుల్లోగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని రాష్ట్రాలకు లేఖలు పంపింది.

‘ఈ అంశం శాసనసభ పరిధిలోకి వస్తుంది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు అవసరం. ఈ విషయంపై ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు వివిధ ప్రాంతాల్లోని వర్గాల్లో ఉన్న ఆచారాలు, పద్ధతులు, నిబంధనలు గమనించాల్సి ఉంది. ఒక సమర్థవంతమైన తీర్పు కోసం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోర్టు ఎదుట ఉంచడం ఆవశ్యకం’ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news