తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగకుండా పోరాటం చేసిన నాయకుడు. తెలంగాణ సమాజాన్ని తన వాగ్ధాటితో చైతన్యం చేసిన మాటకారి. పరాయి పాలనపై అన్ని వేధికలపై తనదైన శైలీలో విరుచుకుపడిన మాటలమరాఠి. తెలంగాణ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన ఈ నేత తెలంగాణ ఏర్పాటులో కీలకభూమిక పోషించారు. తెలంగాణ సాధించిన తరువాత సీఎంగా తనదైన శైలీలో పరిపాలన చేసి ప్రతిపక్షాలను, ప్రజాసంఘాల ఉద్యమాలను నిరంకుశంగా అణిచివేసిన నాయకుడు. మొదటి దఫా ఐదేండ్లు పరిపాలనలో అంతా నియంతృత్వం, నిరంకుశత్వంతో ఉద్యమాలు అణిచివేసి, ప్రతిపక్షాలను తనలో ఐక్యం చేసుకుని పాలన చేసిన నేత. రెండోసారి అధికారంలోకి రాగానే తనదైన శైలీలో పరిపాలన చేస్తూనే ఉన్నాడు.
అయితే ఇప్పుడు తన సత్తాకే సవాల్‌గా నిలిచే కష్టకాలం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎదురైంది. ఇప్పుడు కేసీఆర్ సమర్థతతే పరీక్షగా నిలిచింది ఆర్టీసీ సమ్మె. ఈ సమ్మె కూడా తెలంగాణలో ఓ పెద్ద పండుగ వేళ జరుగుతుంది.కేసీఆర్ వ్యవహారశైలీపై తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గుర్రుగా ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కార్మికులపై, కార్మిక సంఘం నాయకులపై సీఎం కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పోరాట పటిమను ఎంతో పొగిడిన కేసీఆర్ ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికులు తమ అస్థిత్వం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం తెలంగాణ కు వ్యతిరేకం అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటంను అణిచివేయాలని చూసినా, ఆర్టీసి ఉద్యోగుల పై సీఎం కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకున్నా అది ఆయనకే ప్రమాదం ముంచుకొస్తుంది.
ఆర్టీసీ కార్మికులు తెలివిగా తమ పోరాటానికి అన్ని ఉద్యోగ సంఘాల మద్దతు, విపక్ష పార్టీల మద్దతు, విద్యార్ధి సంఘాల మద్దతు కూడా కోరారు. దీనికి అన్ని సంఘాలు సంఘీభావం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో మలిదశ తెలంగాణ ఉద్యమంను తలపించే విధంగా ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యమాన్ని ఉదృతం చేసే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే తెలంగాణ సర్కారుపై అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఎంతో విసిగి వేసారి ఉన్నారు. అయితే తెలంగాణ సర్కారు చేస్తున్న నియంతృత్వ పోకడలకు, అణిచివేత ధోరణికి విసిగి వేసారి ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేసిన సాహాసానికి అందరు లోలోన ఫిదా అవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు రేపిన కార్చిచ్చు ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు లేకపోలేదు.
కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసి సమస్యను పరిష్కరించకపోతే అది మరో తెలంగాణ ఉద్యమంగా రూపుదాల్చడం ఖాయమని స్పష్టం అవుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాటి తెలంగాణ ఉద్యమకారులంతా సంఘీభావం ప్రకటిస్తే కేసీఆర్ కూసాలు కదలాల్సిందే.. ఇక ఆర్టీసీ కార్మికులకు ఆనాటి ఉద్యమ కేంద్రాలు ఉస్మానియా, కాకతీయ యూనివర్సీటీ విద్యార్థులు, సింగరేణి కార్మికులు కలిసే అగ్గికి ఆజ్యం పోసినట్లే.. కేసీఆర్ వ్యవహారశైలీపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనగా ఉన్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులపై కేసీఆర్ వ్యవహరించిన తీరుతో వారు కూడా ఎంతో కోపంగా ఉన్నారు.
ఇంతకాలం అణిగిమనిగి ఉన్న ఉద్యోగులు, కార్మికులు, ప్రతిపక్షాలు అదను కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాలు చేసేందుకు ఇకముందు ప్రతిఒక్కరు సిద్దంగా ఉంటారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే పోయేది ఏమీ లేదు అనేది నానుడి.. దీనికి కొనసాగింపుగా ఇకముందు తెలంగాణలో ఉద్యమాలను చూసే అవకాశం తెలంగాణ ప్రజలకు దొరికిందనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెను లౌక్యంతో పరిష్కరించలేక పోతే.. ఆర్టీసీ కార్మికులకు పోయేది ఏమీ లేదు.. కేసీఆర్ సర్కారుకే తిప్పలు తప్పవు.. ఈ సమస్యను సీఎం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే…