తెలంగాణలో మంత్రుల పనితీరు విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు గట్టిగానే దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది మంత్రుల విషయంలో ఆయన కాస్త నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలకు సహకరించడం లేదు అని ఆరోపణలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఆధారంగా వారి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
ఎంతవరకు పనిచేస్తున్నారు, ప్రజల్లోకి అంతవరకు వెళుతున్నారు, మీడియా సమావేశాల్లో ఎంతవరకు పాల్గొంటున్నారు, అలాగే తన వద్దకు ఎన్ని సమస్యలు తీసుకువచ్చి ఎన్ని వాటికి పరిష్కారాలు చూపిస్తున్నారు, విపక్షాలు ఏ విధంగా సమాధానం చెబుతున్నారు, శాసనసభ సమావేశాల సందర్భంగా ఏ విధంగా వ్యవహరించారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అనే అంశాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే సీఎం కేసీఆర్ కొంతమందితో సమావేశమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
కొంతమంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా సరే సచివాలయం వద్ద కూడా వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. ఇక విపక్షాలకు ఘాటుగా సమాధానం ఇచ్చే విషయంలో ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్న విధంగా విజయం సాధించలేక పోవడానికి కొంతమంది మంత్రులు కారణం అనే అభిప్రాయంలో కూడా సీఎం కేసీఆర్ ఉన్నారు. అందుకే వాళ్ల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించి శాఖలను మార్చే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.