ఆగస్ట్ 23 వెన్నుపోటు?? స‌ర్ధుబాటు???

-

ఆగస్ట్ 23 1995… తెలుగుదేశం పార్టీ మర్చిపోలేని రోజు అది. రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యంలోకి నెట్టిన రోజు… 1989లో రంగా హత్య తర్వాతి పరిణామాలతో ఓడిపోయిన ఎన్టీఆర్… 1994 లో భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి… ఏమీ చేయలేని స్థితిలో ధర్మపీఠంలో కూర్చుని విమర్శలు మాత్రమే చేసిన పరిస్థితికి వచ్చిన రోజు… అసలు ఏం జరిగింది…? వాస్తవాలు ఏం చెప్తున్నాయి… నిజంగా వెన్నుపోటు పోడిచారా…? ఎన్టీఆర్ ని ఎదుర్కొనే శక్తి అప్పటి టీడీపీ నేతలకు ఉందా…?

1993 లో లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు తిరుపతిలో… ఈ పెళ్లి చాలా మందికి అసలు నచ్చలేదు. ఈ పెళ్లితో తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందో అనే ఆందోళన చాలా మందిని వెంటాడింది. అందులో అప్పటి రెవెన్యూ, ఆర్ధిక శాఖా మంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. ఎన్టీఆర్ చెప్పినట్టు చేసి, ఎన్టీఆర్ ఆదేశాలను పాటించిన చంద్రబాబు నాయుడు… ఈ పెళ్లి విషయంలో ఎన్టీఆర్ తో అంగీకారానికి రాలేదు. అక్కడి నుంచి పరిణామాలు మారిపోయాయి… పార్టీలో లక్ష్మీ పార్వతి పెత్తనం పెరిగింది అనేది చంద్రబాబు వాదన.

సాధారణంగా చంద్రబాబు దూకుడు ఉన్న నేత కావడంతో ఎన్టీఆర్ దగ్గర చాలా స్వేచ్చ ఉండేది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతం కావడానికి బాబు వ్యూహాలే ప్రధాన కారణం. కాబట్టి ఎన్టీఆర్ కూడా పూర్తి స్వేచ్చ ఇచ్చారు. 89 లో విపక్ష నేత కావడం, 94 లో కీలక శాఖలను బాబు తీసుకోవడం జరిగాయి. కాని లక్ష్మీ పార్వతి విషయంలో పైకి చెప్పలేని అసంతృప్తి బాబులో పేరుకుపోయింది. అప్పటికే పార్టీలో కీలక నేతలుగా దేవేంద్ర గౌడ్, అశోక గజపతి రాజు, మాధవరెడ్డి వంటి వారు లక్ష్మీ పార్వతితో ఇబ్బంది పడుతున్నారు.

లక్ష్మీ పార్వతి విషయంలో ఎమ్మెల్యేలు కూడా చాలా అసహనంగా ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు… 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ని కలవడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్టీఆర్ తో కలిసి నడిచిన నేతలు కూడా ఎన్టీఆర్ ని కలవాలి అంటే లక్ష్మీ పార్వతి అనుమతి తీసుకోవాలి… నాచారం కుటీరం వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ భావనలో చాలా మంది నేతలు ఉన్నారు. కాని ఎన్టీఆర్ స్వయానా పిల్లను ఇచ్చిన మావ కావడం, పార్టీలో కీలక పాత్ర, ప్రభుత్వంలో కీలక పదవులు ఉండటంతో చంద్రబాబు చాలా వరకు అదుపులోనే ఉన్నారు.

అయితే కీలక నేతలుగా ఉన్న కేసీఆర్, అశోక్ గజపతి, దేవేంద్ర గౌడ్ వంటి వారు లక్ష్మీ పార్వతి పెత్తనంపై తిరగబడ్డారు. ఆగస్ట్ 21 న ఈ తిరుగుబాటు తీవ్ర స్తాయిలో మొదలయింది. మాధవరెడ్డి అప్పటికే తిరుగుబాటు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు కొందరు విశాఖ డాల్ఫిన్ హోటల్ కి, మరి కొందరు వైశ్రాయి హోటల్ కి చేరుకున్నారు. కేసీఆర్ సహా కీలక నేతల సహాయ సహకారాలతో చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆ రోజు ముఖ్యమంత్రి కావాల్సింది మాధవరెడ్డి లేదా అశోక గజపతి రాజు అనేది దగ్గరగా గమనించిన వాళ్ళు చెప్పే మాట.

కాని అల్లుడు కావడం, చంద్రబాబు సామర్ధ్యాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు కావడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నా సరే కేసీఆర్ సహా కొందరు కీలక నేతలు చంద్రబాబుని సిఎం కావాలని సూచించారు. అప్పటికే లక్ష్మీ పార్వతి విషయంలో నందమూరి కుటుంబం మొత్తం కూడా అసహనంగా ఉండటంతో బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారు నో చెప్పలేదు. ఆగస్ట్ 23 నాటికి విశాఖలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వైశ్రాయికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు అందరితో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేసారు. వారు అందరికి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసారు.

అయితే ఇక్కడ చంద్రబాబుని వ్యతిరేకించే వారు చెప్పే మాట ఏంటీ అంటే… ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు పది లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఇచ్చారు అని… 23 వ తేదీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం కావడం, ఆ తర్వాత అందరూ కలిసి గవర్నర్ వద్దకు వెళ్ళడం, ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిగా అంగీకరించడం లేదని, శాసన సభా పక్ష నేతగా చంద్రబాబుని అంగీకరిస్తున్నామని చెప్పడంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసారు. ఆ తర్వాత సరిగా ఏడు రోజులకు చంద్రబాబు సెప్టెంబర్ 1 న సిఎంగా ప్రమాణ స్వీకారం చేసారు.

అప్పుడు ఎన్టీఆర్ వైపు నిలబడిన గోరంట్ల బుచ్చయ్యతో పాటుగా పరిటాల రవి వంటి వారు తర్వాత బాబు వద్దకు చేరారు. అయితే వైశ్రాయి హోటల్ వద్దకు ఎన్టీఆర్ వస్తే చెప్పులు విసిరిన ఘటన మాత్రం చాలా మందిని కలచి వేసింది. అయితే చెప్పులు విసరడం అనేది చంద్రబాబు ఆదేశాలతో జరిగింది అనేది కొందరి మాట… కాని చంద్రబాబుకి తెలియకుండా లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేసుకుని కోపం ఉన్న వాళ్ళు విసిరారు అనేది మరికొందరి మాట. వెన్నుపోటు జరిగిందా లేదా అనేది ఎవరికి తెలియకపోయినా సరే…

అప్పటి పరిణామాలు ఎన్టీఆర్ మీద వ్యతిరేకత కంటే లక్ష్మీ పార్వతి మీద వ్యతిరేకతతోనే జరిగాయి అని చెప్తారు. లక్ష్మీ పార్వతి విషయంలో చాలా మందికి ఆగ్రహం ఉంది కాబట్టే ఆమె ఒంటరి అయిపోయింది అంటారు. ప్రజల్లో కూడా ఆమెపై కోపం ఉంది కాబట్టే చాలా మంది ఎన్టీఆర్ వైపు నిలిచిన వారు కూడా ఆమెతో ఉండలేదు అని, ప్రజలు కూడా ఆమె పార్టీ పెట్టినా సరే ఆదరించలేదు అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news