ఏడాది కాలంలో ప్రజల సంక్షేమానికి అతిపెద్ద పీట వేసి రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న వైకాపా అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ఏడాది పూర్తయిన సందర్భంగా… చంద్రబాబు ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో స్పందించారు! జగన్ ఏడాది పాలనను ట్రైలర్ గా అభివర్ణించిన ఆయన… ఆ ట్రైలర్ పై కొన్ని కామెంట్స్ చేస్తూ… సీనియర్ పొలిటీషియన్ గా కొన్ని సూచనలు చేసే ప్రయత్నం చేశారు!
వైకాపా ఏడాది పాలనతో ప్రజలు ఎంతో విసిగెత్తిపోయారాని మొదలుపెట్టిన చంద్రబాబు… ట్రైలరే ఇలా ఉంటే రాబోయే కాలంలో ఇంకెలా బెంబేలెత్తిస్తారోనని ఎద్దేవా చేశారు! తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం.. బూటకపు మాటలు నమ్మి ప్రజలు ఎంతో మోసపోయారు.. విధ్వంసంతో పాలనా కాలాన్ని ప్రారంభించారు అంటూ బాబు జగన్ ఏడాదిపాలనను ట్రైలర్ గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు! అంటే… కూల్చేసిన ప్రజా వేదికను దృష్టిలో పెట్టుకుని అన్నారో లేక.. అంతకు మించి జగన్ చేసిన విధ్వంసంగా చెబుతున్న “175 లో 23 తెచ్చుకుంటే… వాటిలో కూడ కోత పెడుతున్న విధ్వంసం” గురించి అన్నారా అనేది మాత్రం చిన్న కంఫ్యూజన్!
వాటి సంగతి అలా ఉంటే… 70ఏళ్లు పైబడిన రాజకీయ నాయకుడిగా, రాజశేఖర్ రెడ్డి స్నేహితుడిగా.. జగన్ కు కొన్ని సూచనలు చేశారు బాబు! హైకోర్టు తీర్పుతోనైనా వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను గౌరవించాలని.. సమాజానికి కీడు కల్గించే, రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చే చర్యలకు స్వస్తి చెప్పాలని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే విషయం గుర్తుంచుకోవాలని.. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలని.. ప్రజావ్యతిరేక చర్యలను మానుకోవాలని.. దుందుడుకు చర్యలు మానుకోవాలని.. పరిపాలనపై దృష్టి పెట్టాలన.. జగన్ కు బాబు సూచించారు!
ఎప్పుడు జగన్ పేరుచెప్పినా నిప్పులు చెరిగే బాబు.. ఈ సందర్భంగా కాస్త సున్నితంగా మాట్లాడటం, సామరస్యపూర్వకంగా సలహాలు ఇవ్వడం, పెద్దమనిషిలా హుందాగా మాట్లాడిన భావన కలిగించడం విన్నవారు మాత్రం… నాడు తాను పాటించకపోయినా, మంచి కోరి.. పెద్ద వయసులో పెద్ద మనసుతో చెబుతున్న సూచనలను జగన్ స్వీకరించాలని.. (పైన చేసిన సూచనలు అన్నీ తాను పాటించకపోవడం వల్ల) నేడు తనకు వచ్చిన పరిస్థితి తన స్నేహితుడి కుమారుడికి ఎప్పటికీ రాకూడదనే ఉద్దేశ్యంతోనే బాబు ఇలా జగన్ కు సూచనలు చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు!
ఇంతపెద్దమనసుతో బాబు చేసిన సూచనలపై జగన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు! బాబు నిండు నీరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని.. ప్రతీ ఏడాది జగన్ కు ఇలానే సూచనలు చేయాలని కోరుకుంటున్నారు!