చంద్ర‌బాబుకు ఒకే రోజు ఇద్ద‌రు మాజీ మంత్రుల షాక్‌

-

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఒకే రోజు రెండు అదిరిపోయే షాక్‌లు త‌గిలాయి. బాబుకు షాక్ ఇచ్చిన ఆ ఇద్ద‌రు కూడా టీడీపీకి చెందిన మాజీ మంత్రులే కావడం వివేశం. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఒత్తిడి రాజకీయాలు చేసి పార్టీలోకి తీసుకొచ్చిన వారంతా ఇప్పుడు వెళ్లిపోవటంతో.. మొదట్నించి పార్టీలో పని చేసిన వారే బాబుకు దిక్కు అవుతున్నారు. ఇక క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది.

రెండున్న‌ర ద‌శాబ్దాల రాజ‌కీయ వైరాన్ని ప‌క్క‌న పెట్టి వీరిని చంద్ర‌బాబు ఏకం చేశారు. వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలోకి తీసుకున్న చంద్ర‌బాబు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక ఎన్నిక‌ల్లో సీటు కోసం ఇద్ద‌రూ పోటీ ప‌డగా ఆదికి క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చి…. రామ‌సుబ్బారెడ్డికి జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ సీటు ఇవ్వగా ఇద్ద‌రూ ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఈ ఇద్ద‌రు చంద్ర‌బాబుకు అదిర‌పోయే షాక్ ఇచ్చారు.

కొద్ది రోజులుగా బీజేపీలోకి వెళ‌తార‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను నిజం చేస్తూ ఆదినారాయ‌ణ‌రెడ్డి ఈ రోజు ఢిల్లీలో జేపి.న‌డ్డా స‌మ‌క్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఈ షాక్ ఇలా ఉంటే రామ‌సుబ్బారెడ్డి కూడా చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చారు. క‌డ‌ప జిల్లాలో బ‌ల‌మైన నేత‌గా ఉండడంతో పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా అధినేత నుంచి ఎలాంటి అండ దొరకని రామసుబ్బారెడ్డి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

విమానాశ్రయంలో జగన్‌ను క‌లిసిన ఆయ‌న ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. పార్టీలో ఎంతోకాలం ఉన్నా.. పార్టీ కోసం ఎంతో కష్టపడినా ఇప్పటివరకూ సరైన బ్రేక్ రాలేదన్న బాధలో ఉన్న రామసుబ్బారెడ్డి.. సీఎం జగన్ ను ఎందుకు కలిశారు? దాని వెనుకున్న రాజకీయ కారణం ఏమిటి? అన్నది తేలాల్సి ఉంది. అయితే క‌డ‌ప జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం ఆదినారాయణ‌రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డంతో…. తాను అక్క‌డ టీడీపీలో ఉండి చేసేదేం లేద‌ని… త‌న వ‌ర్గాన్ని కాపాడుకోవాలంటే వైసీపీలోకి వెళ్ల‌డ‌మే బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది.

రామ‌సుబ్బారెడ్డి కూడా పార్టీ మారిపోతే జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ ప‌ని ఖేల్‌ఖ‌తం అయిన‌ట్టే. ఏదేమైనా ఒకే రోజు ఇద్ద‌రు మాజీ మంత్రులు చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వ‌డంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెల‌కొంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే పార్టీ నుంచి మ‌రికొంత‌మంది కీల‌క నేత‌లు సైతం బ‌య‌ట‌కు వెళ్లిపోయే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version