పార్లమెంటులో టీడీపీ ఎంపీలకు పెద్ద సమస్యే వచ్చి పడిందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టి.. వైసీపీ కన్నా.. ఎక్కువ మార్కులు వేయించుకుని.. రాష్ట్రంలో ప్రచారం చేసుకోవాలనేది.. టీడీపీ వ్యూహం. అయితే.. రాష్ట్రంలో కీలకమైన సమస్యలు.. చాలానే ఉన్నాయి. అమరావతిని మూడు ముక్కలు చేస్తానని చెబుతున్న జగన్పై యుద్ధం చేయడం ప్రధానంగా.. టీడీపీకి అవసరం. అయితే.. దీనిపై కేంద్రం ఇప్పటికే స్పష్టంగా తన వైఖరిని తెలియజేసింది. ఈ క్రమంలో ఇక, మిగిలి ఉన్న సమస్యలను పరిశీలిస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. రెండోది విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా చూసుకోవాలి.
ఈ రెండు విషయాల్లో వైసీపీ ఇప్పటికే తన గళాన్ని పార్లమెంటులో వినిపిస్తోంది. వైసీపీ ఎంపీలు.. రాజ్యసభలో దూకుడుగా ఉన్నారు. అయితే.. దీనిపై టీడీపీ చేస్తున్న పోరాటాలు.. పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. రాజ్యసభలో టీడీపికి ఇప్పుడు బలం చాలా తగ్గిపోయింది. గతంలో రాజ్యసభకు వెళ్లిన సీఎం రమేష్, టీజీవెంకటేష్ సహా పలువురు బీజేపీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగినా.. వైసీపీని మించిన తరహాలో మాత్రం టీడీపీ సాగలేక పోతోంది. ఈ క్రమంలో హోదా, ఉక్కు విషయాల్లో ఏదో ఒక దానిపైన ఉద్యమం చేస్తే.. పార్లమెంటులో గళం వినిపిస్తే.. బెటర్ కదా! అనే సూచనలు వస్తున్నాయి. అయితే.. వీటిలో రెండూ కూడా టీడీపీకి ప్రధానమే.
దేనినీ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినా.. వ్యూహం బెడిసి కొడుతుంది. అలాగని.. రెండు అంశాలను పట్టుకుంటే.. మీకు క్లారిటీ లేదని.. ఇటీవల రాజ్యసభ చైర్మన్.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏదో ఒక అంశాన్ని ఒకరోజు లేవనెత్తి.. రెండో అంశాన్ని.. రెండో రోజు లేవనెత్తడం ద్వారా వైసీపీపై పైచేయి సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచన ప్రాయంగా చెప్పినట్టు సమాచారం. అయితే.. ఇది సాధ్యమేనా.. అనేది ప్రశ్న. ఎందుకంటే. కేవలం ఈ రెండు అంశాలను తీసుకుని.. రాష్ట్రంలోని జగన్ సర్కారుపై విమర్శలు చేయడానికే పరిమితమే.. అది కూడా టీడీపీకి ఇబ్బందికర పరిణామమనే అంటున్నారు పరిశీలకులు.