కరోనా దెబ్బకు ఇప్పుడు భక్తి లేదు రక్తి లేదు. ఎవరు అయినా సరే ఇంట్లో ఉండటమే. ఎక్కడికి వెళ్ళడం కుదరక అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. కీలక దేవాలయాలు అన్నీ కూడా మూతపడ్డాయి. తిరుమల దేవాలయం కూడా మూసి వేసారు. చిన్నా పెద్దా దేవాలయాలు అన్నీ కూడా ఇప్పుడు మూసి వేయడంతో భక్తులు ఇంట్లోనే పూజలు చేసుకుంటున్నారు. ఇక భక్తి యాత్రలు కూడా ఆపేశారు.
ఈ తరుణంలో చార్ ధాం యాత్ర మొదలయింది. వేలాదిమంది భక్తులు వెళ్ళే ఈ యాత్ర చాలా సందడిగా ఉండేది. దైవాన్ని తలుస్తూ ఓం నమఃశివాయా అంటూ వెళ్తూ ఉంటారు. ఈ యాత్ర ఇప్పుడు భక్తులు లేకుండానే జరుగుతుంది. దైవనామస్మరణల మధ్య, సందడిగా ప్రారంభమయ్యే చార్‌ధామ్ ఆలయాలు, ఈ ఏడాది మాత్రం నిరాడంబరంగా తెరచుకోనున్నాయని అధికారులు వివరించారు.
కరోనా వ్యాప్తి బెడదను దృష్టిలో పెట్టుకుని, భక్తులకు ప్రవేశాన్ని ప్రస్తుతానికి నిషేధించామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం కొద్దిమంది పూజారుల సమక్షంలో చార్‌ధామ్ ఆలయాల్లో పూజలు పునఃప్రారంభమవుతాయని, ఆదివారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను, ఈ 29న కేదార్‌నాథ్, వచ్చే నెల 15న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకుంటాయని కేంద్రం వివరించింది.