తమిళనాడుని మాండూస్ తుఫాన్ అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై సహా చెంగల్పట్టు, విలుగుపురం, కాంచీపురం, కరైకల్, పుదుచ్చేరి సహ పలు ప్రాంతాలలో బలమైన ఈదురు గాలులు వీచాయి.
ఈ గాలులకు పలు ప్రాంతాలలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపు 200 కి పైగా చెట్లు కూలినట్లు అధికారులు తెలియజేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పకూలిన చెట్లను తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. తుఫాను ప్రమాదం నుంచి చెన్నై బయటపడిందని తెలిపారు సీఎం స్టాలిన్. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.