తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. వరుస జాతీయ నేతల పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం పెంచుతున్నారు. తాజాగా తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు. దేశంలో అన్ని నగరాల్లో పోల్చితే హైదరాబాద్ నగరంలోనే గ్యాస్ ధరలు అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు పెరిగాయని విమర్శించారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో చెప్పి ఆ తర్వాత మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కి చరిత్రపై సరైన అవగాహన లేదని… ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో సరిగా తెలుసుకోలేదని చిదంబరం ఎద్దేవా చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడారో తనకు గుర్తుందని తెలిపారు. కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ అంటున్నారని… తనకు వచ్చే సీట్లతో ఆయన కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతారని ఎద్దేవా చేశారు.