చిలికా సరస్సు చూడదగ్గ ప్రదేశం. సరదాగా ఒక ట్రిప్ వేసుకుంటే అందమైన ప్రదేశాలని అన్ని చూసుకుంటూ పోవొచ్చు. చిలికా సరస్సు నుండి మొదలు బెర్హంపూర్, ఉదయగిరి, భువనేశ్వర్ పర్దీప్, గోపాల్పూర్ వంటి వాటిని కూడా చూసేయొచ్చు. చిలికా సరస్సు భారత దేశపు తూర్పు తీరం లో ఉన్న ఉప్పు నీటి సరస్సు. ఇది దయా నది ముఖ ద్వారం వద్ద ఒడిషా రాష్ట్రం లోని పూరీ, గంజాం జిల్లాలో విస్తరించి ఉంది. నిజంగా చిలికా సరస్సు గురించి చెప్పుకుని తీరాలి. అక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఈ ప్రదేశం బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడు మీరు ఇక్కడికి వెళ్లి ఉండక పోతే ఒకసారి వెళ్ళండి. ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.
ఈ సరస్సు అంతా కూడా వలస పక్షుల తో ఎంతో అందంగా ఉంటుంది. ఈ వలస పక్షుల విషయం లోకి వస్తే… శీతాకాలం లో కాస్పియన్ సముద్రం, ఇరాన్, రష్యా, సైబీరియా నుంచి వచ్చిన అనేక వలస పక్షులకు ఆవాసంగా మారింది. అయితే ఏకంగా వలస సీజన్లో 205 పక్షి జాతులని ఈ సరస్సు వద్ద సందర్శించవచ్చు అని అంచనా. చూసారా ఎన్ని రకాలో…! దీని విస్తీర్ణం 1100 చదరపు కిలో మీటర్లు పైచిలుకు ఉంటుంది.
ఇక్కడున్న పక్షుల్లో 45 శాతం నేల పై ఉండేవి, 32 శాతం నీటి పక్షులు ఉన్నాయి. 23 శాతం ఒడ్డున నీటి లో నడుస్తూ వేటాడే తీర పక్షులు. 14 రకాల వేటాడే పక్షులు కూడా ఉన్నాయి. సుమారు 152 ఐన ఇరావడీ డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. అంతే కాదండి 37 రకాల సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉన్నాయి అని అధ్యయనంలో వెల్లడించారు.