వుహాన్‌లో కరోనావైరస్ తొలిదశలో ఉన్నప్పుడే గుర్తించిన హాంకాంగ్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్, సర్జన్, ప్రొఫెసర్ క్వాక్ యంగ్ యుయెన్.. చైనా బాగోతాన్ని బట్టబయలు చేశారు. వైరస్‌ను గుర్తించి దానిపై దర్యాప్తు చేసేందుకు వెళ్లగా.. అప్పటికే హువానాన్ జంతు మార్కెట్లోని భౌతిక ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీతో మాట్లాడిన ఆయన.. అప్పటికే గుర్తించిన క్లినికల్ ఆధారాలపై అధికారులు ఆలస్యంగా స్పందించారని పేర్కొన్నారు. వైరస్ గురించి సమాచారాన్ని దాచిపెట్టినందుకు అమెరికా సహా చాలా దేశాలు.. చైనాను నిలదీస్తున్నాయి.
పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది. సమాచారాన్ని సరైన సమయంలోనే పంచుకున్నట్లు చెబుతోంది. మరోవైపు తొలి వైరస్ కేసును గుర్తించి, హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్నూ చైనా బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్లో నమోదైన తొలి కేసును గుర్తించిన ఆయన.. సార్స్ వైరస్ వంటి లక్షణాలు కనిపించినట్లు తోటివారికి సమాచారం అందించాడు. చివరకు ఆయనకు కూడా వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఫిబ్రవరిలో వెన్లియాంగ్ మరణించారు.