చిరు బ్యాచ్ బీజేపీలోకి జంప్ చేస్తుందా..!

-

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు కాస్త దూరంగా ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరపై గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి… తాజాగా తొలి తెలుగు స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైరా రిలీజ్ అయిందో లేదో వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే మరో పొలిటికల్ థ్రిల్లర్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరు ఇప్పుడు పొలిటికల్ గా కూడా బిజెపితో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కృషి చేసిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఒత్తిడి మేరకే చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన మంత్రి పదవుల్లో ఒక‌టి గంటాకు దక్కింది. ఆ తర్వాత ఆ ప్రజారాజ్యం మొత్తం కట్టకట్టుకుని టిడిపిలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచింది. ఐదేళ్ళపాటు టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంట తాజాగా ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గెలిచారు.

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంటా.. ఆ పార్టీ తరఫున 1999లో ఎంపీగా, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల సమయంలో అనూహ్యంగా చిరు ప్రారంభించిన ప్రజారాజ్యంలోకి చేరి.. ఆ పార్టీ తరఫున కూడా మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో మంత్రి అయిన ఆయ‌న 2014 ఎన్నికల సమయంలో మళ్లీ టీడీపీలో చేరి.. చంద్రబాబు హయాంలోనూ ఆయన మంత్రి పదవిని సంపాదించుకున్నారు. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ.. టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఆయన హవా కాస్త తగ్గింది.

ఇక అధికారం చుట్టూనే తిరిగే గంటాకు ఇప్పుడు వైసీపీ లేదా బీజేపీ మాత్ర‌మే ఆప్ష‌న్‌గా ఉన్నాయి. ఇక బీజేపీలోకి వెళ్లాల‌నుకుంటోన్న గంటా ఇటీవ‌ల చిరంజీవితో ఎక్కువుగా క‌లిసి తిరుగుతున్నారు. సైరాం టీంకి చిరు ఇచ్చిన పార్టీలో ఉన్న గంటా.. చిరు ఎస్వీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన‌ప్పుడు తాడేప‌ల్లిగూడెంలోనూ ఉన్నారు.. ఇక చిరు ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లోనూ కూడా క‌నిపిస్తున్నారు. అలాగే గంటా ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాల్లో చిరు కుటుంబం కూడా సందడి చేయ‌డం ఇటీవ‌ల ఎక్కువైంది. ఏదేమైనా గంటా చిరు బ్యాచ్‌తో క‌లిసి బీజేపీలో చేరితే అక్క‌డ త‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి రాకపోదా ? అన్న ప్లాన్‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి గంటా ప్లాన్‌కు చిరు ఓకే చెపుతాడా ?  గంటా ప‌ద‌వి కోరిక నెర‌వేరుతుందా ? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news