బిగ్‌బాస్ 3కు ఈ లోపాలే పెద్ద శాపాలా..

తెలుగు బిగ్ బాస్‌ షో ఫైనల్‌కి చేరువలో ఉంది. మొదటి రెండు సీజన్ల కంటే.. మూడో సీజన్‌కి ఊహించనంతగా అభిమానులు పెరిగిపోయారు. చూసే వాళ్ల సంఖ్య ప్ర‌తి సీజ‌న్‌కు పెర‌గ‌డం కామ‌నే అయినా కొన్ని లోపాలు ఈ సీజ‌న్‌లో చాలా ఎపిసోడ్ల‌ను నీరుగార్చేశాయి. ఇక ఓటింగ్ శాతం పెరిగినా సీజ‌న్ 3కు క్రేజ్ ఎంత ఉందో విమ‌ర్శ‌లు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.

ముఖ్యంగా ఓటింగ్ ప్ర‌క్రియ అనేది ముందునుంచి ర‌హ‌స్య‌మే అయినా ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నార‌న్న‌ది ముందే తెలిసిపోతోంది. సోష‌ల్ మీడియాలో లీకులు వ‌చ్చేస్తున్నాయి. ఇక రేటింగ్స్ కోసం బిగ్‌బాస్ నిర్వాహ‌కులే ముందు నుంచి ప్రోమోల‌ను వ‌దులుతుండ‌డంతో ప్రేక్ష‌కుల్లో అస‌లు ట్విస్ట్ రివీల్ అయ్యి ఆస‌క్తి స‌న్నిగిల్లుతోంది.

ఇక గ‌తంలో బిగ్‌బాస్‌పై విమ‌ర్శ‌లు చేసిన నాగార్జున ఇప్పుడు ఈ షోకు హోస్ట్‌గా ఉండ‌డంతో కూడా నాగ్‌ను టార్గెట్‌గా చేసుకుని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. గ‌త సీజ‌న్ల‌లో ఇంటి స‌భ్యుల మ‌ధ్య ఐక్య‌త ఎక్కువుగా ఉండేది. ఇప్పుడు ఎవ‌రికి వారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది స్వార్థంతోనే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది ఓపెన్‌గానే తెలిసిపోతోంది.

మ‌రో షాక్ ఏంటంటే కొంద‌రు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ముందే ఎలిమినేట్ అవ్వ‌గా… వీక్ టెస్టెంట్లు హౌస్‌లో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఏ టాస్క్‌లోనూ యాక్టివ్‌గా కనిపించని పునర్నవి 11 వారాల పాటు హౌస్‌లో నెట్టుకొచ్చింది. ఇందుకు రాహుల్ – పున‌ర్న‌వి మ‌ధ్య న‌డిచిన ల‌వ్ ట్రాక్ రీజ‌న్ అన్నది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక తెలుగు షోలో త‌మిళుడు అయిన బాబా భాస్క‌ర్‌ను తీసుకోవ‌డంపై ముందుగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తెలుగులో ఎంతో మంది సెలెబ్రిటీలు ఉండగా.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నించారు. కానీ ఇప్పుడు హౌస్‌లో బాబా ఆడుతోన్న గేమ్ చూశాక అంద‌రూ షాక్ అవుతున్నారు. ఏదేమైనా బిగ్‌బాస్‌లో ఉన్న లోపాలే షోకు శాపాలుగా మారుతున్నాయి.