నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. ఒక్కొకరు ఒక్కో రకంగా ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తే, మరికొంతమంది అన్నదానాలు చేస్తుంటారు, ఇంకొంతమంది రక్తదానాలు చేస్తుంటారు. చూపించే విధానం వేరైనా… అందరికీ అన్నగారిపై ఉన్న అభిమానం సమానమే! సినీ నటుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ముద్ర చెరపలేనిది, చెరిగిపోనిది! ఈ క్రమంలో పెద్దయన జయంతి రోజు ప్రతి ఏటా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులర్పిస్తుంటారు.
ఈ ఏడాది కరోనా కారణంగా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లకుండా ట్విట్టర్ లో తాతను గుర్తు చేసుకోగా… ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లారు.. రామారావు కారణజన్ముడని పొగిడారు. ఇవన్నీ ఒకెత్తు అయితే… చిరంజీవి వేసిన ట్వీట్ ఒకెత్తు! ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరు పెట్టిన పోస్టింగ్ అదిరిపోయేలా ఉంది. “తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ… ” అంటూ చిరు వేసిన ట్వీట్, అందులో పెట్టిన ఫోటో నందమూరి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది!
దీంతో ఈ జయంతి రోజున బాలయ్య మాటల కంటే.. చిరు వాడిన పదాలే బాగున్నాయంటూ సోషల్ మీడియాలో పోలికలు, వాటికి మార్కులు మొదలైంది. బాలయ్య స్పీచ్ రొటీన్ గా సాగగా… చిరు మాటలు మాత్రం నందమూరి అభిమానులను ఎక్కడో తాకాయని కామెంట్లు పెడుతూ… ఎన్టీఆర్ పై ట్వీట్ వేసిన చిరంజీవిని ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో ఒక్క ట్వీట్ ద్వారా నందమూరి అభిమానుల మనసుదోచుకున్నారు చిరు అంటూ కామెంట్లు పడుతున్నాయి!