హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 8వ తేదీ నుంచి నగరంలో సిటీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా గత 70 రోజులుగా సిటీ బస్సులు తిరగడం లేదు. కాగా కొన్ని రోజుల కిందటే రాష్ట్రంలో జిల్లా బస్సులకు అనుమతిచ్చారు. ఇక జూన్ 8 నుంచి సిటీ బస్సులు కూడా తిరగనున్నాయి.
కేంద్రం లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇస్తుండడంతో బుధవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్‌టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో బస్సులను ఏ విధంగా నడిపిస్తే బాగుంటుందనే అంశంపై చర్చించారు. ఆ తరువాతే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్‌టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. దీంతో వారు ఇక ఊపిరి పీల్చుకోనున్నారు. ఇప్పటి వరకు వారు ప్రైవేటు రవాణాను ఆశ్రయించారు. కానీ బస్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇకపై వారికి ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.