మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా..? ఇదే అదనుగా అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుని అగ్నిఆజ్యం పోస్తాయా..? అంటే తాజా పరిణామాలు మాత్రం ఔననే అంటున్నాయి. ఆసీయా మైనర్ ప్రాంతంలో ఆర్మీనియా, అజర్‌బైజాన్‌లు చిన్నదేశాలు. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. సరిహద్దు ప్రాంతంపై పట్టుకోసం ఈ రెండు రాజ్యాలు యుద్ధానికి దిగాయి. ఆర్మేనియాలో క్రిస్టియన్లు అధికంగా ఉంటారు. అజర్‌బైజాన్‌లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఇది ముస్లిం రాజ్యం. ఈ రెండు దేశాల మధ్య నగొర్నో కరబఖ్ ప్రాంతం ఉంది. ఆర్మేనియన్ జాతి ప్రజలు ఎక్కువగా ఉండే నగొర్నో కరబఖ్ ప్రాంతం అజరబైజాన్ భూభాగంలో ఉన్నది. దీంతో ఆ ప్రాంతాన్ని ఆర్మేనియాలో కలుపాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు.
అయితే.. వారికి మద్దతుగా ఆర్మేనియా ప్రభుత్వం రంగంలోకి దిగడంతో యుద్ధం మొదలైంది. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య భీకరపోరు జరుగుతూనే ఉంది. అయితే.. ఆర్మేనియాకు రష్యా, అజర్‌బైజాన్‌కు టర్కీ మద్దతుగా నిలవడం గమనార్హం. ఆయా దేశాల తరఫున యుద్ధంలోకి కూడా దిగే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. అంతేగాకుండా.. ముస్లిం రాజ్యమైన అజర్‌బైజాన్ తరఫున యుద్ధం చేసేందుకు పాకిస్థాన్ కూడా సైనికులను పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.