బెజవాడ దుర్గమ్మ కొలువుతీరిన ఇంద్రకీలాద్రి కొండపై ప్రమాదకరంగా మారిన కొండ చరియలకు శాశ్వత పరిష్కారం కనుక్కునే పనిలో దేవస్థానంతోపాటు జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో కొండ చరియలు విరిగిపడటతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకపోవటంతో ఊపిరిపీల్చుకుంది. అయితే ఇలానే కొండచరియలు పడటం వల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా భక్తులకు ఇబ్బంది కాబట్టి ఈ ప్రమాదం బారిన పడకుండా పరిష్కారం కనుక్కోవటంపై ఫోకస్ పెట్టింది. రేపు నిపుణుల బృందం దుర్గగుడిపై పరిశీలన జరపనుంది.
దుర్గగుడిపై కొండరాళ్ళు తరచూ జారిపడటం భక్తులు భయాందోళనకు గురవ్వటంతో శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండరాళ్ళు జారపడకుండా ఉండటానికి పలు ఐఐటీలకు చెందిన ప్రోఫెసర్లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన నిపుణులు నవంబరు 2న కొండపై పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రి కొండను పరిశీలిస్తే కొండంతా ఒకేరకంగా కాకుండా కొన్ని చోట్ల వదులైన రాళ్ళు, కొన్నిచోట్ల పగుళ్ళులేని కొండ రాళ్ళు ఉన్నాయి.
ఎక్కువ భాగంలో మోత్తంగా, మట్ఠి మాదిరిగా రాళ్ళు ఉన్నాయి. కొన్ని రాళ్ళు ఒకదానిపై మరొకటి ఉండి పడిపోయేంత ప్రమాదకరంగా ఉన్నాయి. దీనితో కింది రాళ్ళను పైన ఉన్న రాళ్ళకి కలిపి బోల్టులు మాదిరి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. చిన్న రాళ్ళు ఉన్న చోట చైన్ లింకు మెష్ వేసి క్రాంక్ లు బిగించాలి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేస్తే ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగి ముందుగానే ప్రమాదం గుర్తించవచ్చని భావిస్తున్నారు.