కోడికత్తి కేసులో మరింత దర్యాప్తు కోసం అభ్యర్థిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్ఐఏ కోర్టులో గురువారం కౌంటర్లు దాఖలయ్యాయి. ఎన్ఐఏ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాల్ గౌతమ్, నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం కౌంటర్లు వేశారు. వీటిపై తమ వాదనలు వినిపించేందుకు జగన్ తరఫు అడ్వకేట్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు సమయం కావాలని కోరారు. తదుపరి వాదనల నిమిత్తం ఈ నెల 17కి న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తి వాయిదా వేశారు.
కేసు సక్రమంగా విచారణ జరగకుండా సాగదీసేందుకు బాధితుడైన సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసినట్లు కనపడుతోందని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది తన కౌంటర్లో పేర్కొన్నారు. ‘‘సీఎంకు కేసు విచారణపై ఆసక్తి లేదు. కోర్టుకు రాకుండా తప్పించుకునేందుకే.. మరింత దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానానికి 20 కి.మీ దూరంలోనే జగన్ ఉన్నా.. కోర్టుకు రావడానికి సుముఖంగా లేరు. ఈ కేసులో మొదటి సాక్షి అయిన విశాఖ విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్ విచారణ సందర్భంగానూ కొత్త వాస్తవాలేవీ బయటకు రాలేదు. అలాంటప్పుడు.. ఇప్పటికే పూర్తయిన దర్యాప్తును పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కొత్త విషయాలేవీ వెలుగులోనికి రానప్పుడు మరింత దర్యాప్తు చేయాలని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని పిటిషన్లో పేర్కొన్నారు.