నూతన ఇసుక విధానం పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇసుక పాలసీ పై సమీక్షలో సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుందని రవాణా వ్యయం ఎక్కువగా ఉందని. అది రీజనబుల్‌గా ఉండేలా చూడాలన్నారు. ఏ రేటుకు అమ్మాలి అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ చేసి చలాన్ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా సింపుల్ గా ఉండాలన్నారు. నిర్ణయించిన రేటుకన్న ఎక్కువకు విక్రయిస్తే ఎస్‌ఈబీ రంగ ప్రవేశం చేస్తుందన్నారు.
ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని దీనికి టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేస్తే బావుంటుందన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి సూచించారు. ఇక ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి, ప్రజల సూచనలు, సలహాలు, అభిప్రాయాలు కూడా తీసుకోవాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు సీఎం జగన్. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో పాటు, పంచాయతీరాజ్ శాఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.