సీట్ల మార్పుపై ముఖ్యమంత్రి జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. జగన్ తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఫీలింగే ఇప్పుడు ఎమ్మెల్యేలలో ఉందన్నారు. నాడు జగన్ బాధ పడ్డట్టుగానే ఇప్పుడు సీట్ల మార్పు ఎమ్మెల్యేల ఫీలింగ్ కూడా అలాగే ఉందని అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ మార్చడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. జగన్ ఆలోచన అలా లేదన్నారు. సీట్లు మార్పు చాలా జాగ్రత్తగా చేయాలని సలహా ఇచ్చారు. జగన్ కు వాలంటీర్ల మధ్య ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు పవర్ ఎక్కడుందని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలకు గ్రాఫ్ పెరగలేదని అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. రాజమండ్రిలో తనకు మొదట అంగిటపల్లి చినఎరుకల రెడ్డి కి టికెట్ ఇచ్చారని, కానీ తనను ఏసీవై రెడ్డి ఓడించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అదే ఏసీవై రెడ్డిని ఒప్పించి నాకు సీటు ఇచ్చి ఉంటే గెలిచే వాడినేమో అని అభిప్రాయపడ్డారు. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమి చెప్పలేమని, దేశంలో ఎక్కడా లేని ప్రయోగం జనానికి డబ్బులు పంచే కార్యక్రమం జగన్ చేశాడని వ్యాఖ్యానించారు. అయితే అది కొత్త ఏమీ కాదు. ఇలాంటి ప్రయోగాలు ఇందిరా గాంధీ భూమి పంపిణీతో మొదలుపెట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో సీట్ల మార్పు చేయకపోవడం వల్లే అధికార పార్టీ ఓడిపోయిందని, ఇక్కడ సీట్లు మారిస్తే గెలుపు సాధ్యం అనుకోవడం సరికాదని అన్నారు. వైఎస్సార్ పేరుతో పార్టీ పెట్టి లక్ష్యాలు విషయంలో, ఆశయాలు అంశంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మనుగడ కష్టమేనని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.