జగన్ vs నిమ్మగడ్డ..ట్విస్టులు మాములుగా లేవుగా

-

ఏపీలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసినా.. అది సోమవారం దాక తేలేలా కనిపించకపోవడంతో రేపటి నోటిఫికేషన్ పై ఆసక్తి నెలకొంది.

రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఓ వైపు.. మరోవైపు సీఎం వైఎస్ జగన్‌ చర్చోప చర్చలు జరుపుతూ ప్యూహాలకు పదును పెడుతున్నారు.అడ్వొకేట్ జనరల్‌ శ్రీరాం, హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల,ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో సుదీర్ఘంగా భేటీ అయిన జగన్ కీలక విషయాల పై చర్చించారు. ఇదే సమయంలో ఎస్‌ఈసీకి నోట్‌ పంపించారు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌.. వ్యాక్సినేషన్‌, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని.. ఇదే విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని.. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు ఆగాలంటూ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో 9 మంది అధికారులు అలసత్వం వహించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సీఎస్‌, డీజీపీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిద్దరికీ మెమోలు జారీ చేశారు.

ఈ ఉదయమే సమావేశం నిర్వహించాలని ఎస్‌ఈసీ భావించినప్పటికీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వారితో సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఆ సమయానికి ఇద్దరు అధికారులు హాజరుకాకపోవడంతో ఎస్‌ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మెమోలు జారీ చేశారు.

మరో వైపు ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న నేపథ్యంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటీ అయింది. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు పాల్గొనలేమని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు సీఎస్‌ను కలిసి 9 పేజీల వినతిపత్రం అందజేశారు.

రేపు నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news