జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సిఎం కె.చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతోపాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సిఎం కోరుకున్నారు.
భారతదేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. కాగా జులై 23 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి రెండు రోజుల ముందు జులై 21నే ఫుకుషిమాలో ‘‘సాఫ్ట్‌బాల్’’ పోటీలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 33 విభాగాల్లో 339 పతకాల కోసం క్రీడాకారులు పోటీ పడబోతున్నారు. తొలి పతాక ప్రధాన కార్యక్రమం జులై 24న నిర్వహిస్తారు. ఇక ఇటు క్రీడాకారులలో కరోనా మహమ్మారి భయం నెలకొంది.