తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. హామీలను నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. అలాగే నిరుద్యోగుల మరణాలకు కూడా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు. కాగ నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు.
తొలి సంతకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. లక్ష కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందరు కలిసి ఉద్యమాన్ని నిర్మిద్దామని అన్నారు. అందుకోసమే కోటి సంతకాల కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అలాగే ధరణి వెబ్ పోర్టల్ ను ప్రారంభించి రెండు ఏళ్లు గడుస్తున్నా.. సమస్యలన్నీ అలాగే ఉన్నాయని అన్నారు. కానీ ముఖ్యమంత్రి ధరణి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.