పైపైకి దూసుకొస్తున్న ప్రత్యర్థిని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తికాదేమో..! అదును చూసి గూబగుయ్‌మనిపించడంలో కేసీఆర్‌ది ప్రత్యేకశైలి. తాజాగా.. బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చేసినట్లు చెప్పొచ్చు. తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమాంద్యంపై ఎక్కువ దృష్టిపెట్టారు. దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం గురించే ఎక్కువగా చెప్పుకొచ్చారు.
ఆర్థికమాంద్యానికి కేంద్రం అనుసరిస్తన్న విధానాలే కారణమంటూ బీజేపీని టార్గెట్ చేశారు కేసీఆర్. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని వెల్లడించారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూల ధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు.
ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. వ్యూహాత్మకంగా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. గత ఏడాదిన్నర దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని ఆయన తన ప్రసంగంలో వివరించారు.
అంతేగాకుండా.. విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు తాను చింతిస్తున్నానని కేసీఆర్ అనగడం గమనార్హం. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని కేసీఆర్ వాపోయారు.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. కేంద్రం విధానాలతో ఆర్థికమాంద్యం ఏర్పడితే.. తాము అనుసరిస్తున్న విధానాల వల్లే తెలంగాణ తట్టుకుని నిలబడుతోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆర్థిక మాంద్యం అంశాన్ని కేసీఆర్ బాగా ఉపయోగించుకున్నారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ మాంత్రికుడి వ్యూహం అంటే ఇలాగే ఉంటుందని కూడా చర్చలు నడుస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల్లోనే లోపాల వల్లే ఆర్థికమాంద్యానికి కారణమని కేసీఆర్ చెప్పడంలో ఇదే ఆంతర్యమని అంటున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బీజేపీ.. ఇక తెలంగాణ ఎలా బాగుచేస్తుందనే ఆలోచనను కేసీఆర్ ప్రత్యక్షంగా ప్రజల్లో రేకెత్తించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పని కమలం నేతలపై ఉందని అంటున్నారు.