ట్రబుల్ షూటర్..కాదు కాదు.. షార్ప్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వంలో కొత్త రోల్ పోషిస్తున్నారు. అసలు మంత్రివర్గంలో చోటుదక్కుతుందో లేదోనన్న అనుమానామాల మధ్య అనూహ్యంగా చోటుదక్కించుకున్న హరీశ్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేగాకుండా.. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరునాడే.. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు హరీశ్. అంటే మండలిలో హరీశ్, శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. స్వరాష్ట్రంలో రెండో ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగెత్తించి, కాళేశ్వర్‌రావుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో ప్రభుత్వంలో మాత్రం మరో కొత్త పాత్ర పోషిస్తున్నారు. హరీశ్‌రావు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వంలో క్రీడలు, యువజన సర్వీసులు, 2014లో ఏర్పడిన కేసీఆర్ సర్కార్‌లో కీలకమైన సాగునీటి పారుదల శాఖలను నిర్వహించారు. తాజాగా.. జరిగిన మంత్రివర్గ విస్తరణలో స్థానం సంపాదించుకుని, తొలిసారి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వహించబోతున్నారు.
ఆర్థికమంత్రిగా ఆదివారం ప్రమాణం చేసిన హరీశ్ రావు… సోమవారం బడ్జెట్ ప్రసంగం చేయబోతున్నారు. దీంతో అందరి దృష్టి హరీశ్‌పై ఉంది. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. దేశీయంగా ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న తరుణంలో హరీశ్‌కు ఆర్థిక శాఖ అప్పగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన ఈ బాధ్యతలు పెద్దసవాలేనని చెప్పొచ్చు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం అంత సులవేం కాదుమరి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంకేమ పథకాలు, పెద్దపెద్ద ప్రాజెక్టుల నేపథ్యంలో హరీశ్ ఎలా పనిచేస్తారన్నది అందరిలో ఆసక్తినిరేపుతోంది.
నిజానికి.. మొదటి ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ముందస్తు ఎన్నికల వరకు అంటే.. పూర్తిస్థాయిలో ఆయన కొనసాగారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించి, ఆర్థిక శాఖను మాత్రం కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి స్థానం కల్పించి, పూరిపూర్ణం చేశారు. ఆర్థిక శాఖను హరీశ్‌రావుకు అప్పగించారు. అయితే.. మంత్రివర్గంలో చోటుదక్కదనే ఊహాగానాలకు చెక్ పెడుతూ..ఏకంగా ఆర్థిక మంత్రిగా హరీశ్‌కు బాధ్యతలు అప్పగించడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆర్థికమాంద్యం రూపంలో తరుముకొస్తున్న ప్రమాదం నుంచి బయటపడేందుకే హరీశ్‌కు బాధ్యతలు అప్పగించారనే టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి హరీశ్‌రావు ఏం చేస్తారో..!