అత్యంత భారీగా త్వరలో కేసీఆర్ మహా సుదర్శన యాగం..!

-

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగం నిర్వహిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయన చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి స్వామీజీతో యాగ నిర్వహణపై చర్చించారని తెలిసింది.

కేసీఆర్‌కు ఉండే దైవ భక్తి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దైవాన్ని బలంగా విశ్వసిస్తారు. అందుకే ఆయన ఏ పని చేసినా, ఎంతటి గొప్ప పథకాన్ని ప్రారంభించినా, చివరకు సభల్లో ఉపన్యాసాలు ఇచ్చినా.. ప్రతి పని ముందు కచ్చితంగా పూజలు చేస్తారు. అవసరమైతే దైవ దర్శనం కూడా చేసుకుంటారు. ఈ క్రమంలోనే కేసీఆర్ గతంలోనే ఎన్నో మహాయాగాలు నిర్వహించారు. అయితే ఇప్పుడాయన మరొక యాగం నిర్వహించ తలపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగం నిర్వహిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయన మంగళవారం శంషాబాద్ సమీపంలో ఉన్న ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి స్వామీజీతో యాగ నిర్వహణపై చర్చించారని తెలిసింది. స్వామీజీతో మహా సుదర్శన యాగం గురించి చర్చించిన కేసీఆర్ యాగం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు యాగం జరిగే తేదీలను కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పరిసరాల్లో ఈ యాగాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

యాగం నిర్వహించేందుకు గాను అవసరమైన సలహాలు, సూచనలను సీఎం కేసీఆర్.. చినజీయర్ స్వామి నుంచి తీసుకున్నారని సమాచారం. యాదాద్రి వద్ద 100 ఎకరాల్లో 3వేల మంది రుత్వికులు, మరో 3వేల మంది పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ, 1048 యజ్ఞ కుండాలతో అత్యంత భారీగా మహా సుదర్శన యాగం నిర్వహిస్తారని తెలిసింది. ఇక ఈ యాగానికి దేశంలో ఉన్న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను కూడా కేసీఆర్ ఆహ్వానించనున్నారట. కాగా ఈ యాగం పూర్తిగా చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతుందని సమాచారం. అయితే యాగం ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కానీ, ఆ వివరాలు కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. కేసీఆర్ మరోసారి అత్యంత భారీగా, ప్రతిష్టాత్మకంగా యాగం నిర్వహించనుండడంతో ఇప్పుడు అందరి దృష్టంతా యాగంపైనే ఉండనుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version