దేశంలో పలు రాష్ట్రాలలో పలు రకాల సెంటిమెంట్లు ఉన్నాయి. కొన్నిచోట్లలో పర్యటిస్తే పదవి గండం అని బాగా ప్రచారంలో ఉంది. అదేకోవలోకి వచ్చే ఒక ప్రాంతం గురించిన విశేషాలు తెలుసుకుందాం…
కర్ణాటక రాష్ట్రంలో చామరాజనగర జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ముఖ్యమంత్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అక్కడికెళ్తే ఆరునెలల్లో పదవీ గండం తప్పదనే ప్రచారం ఉంది. ఇలాంటి ప్రచారమే అరేబియా తీర నగరం కార్వార మీద కూడా జరుగుతోంది. ఉత్తర కన్నడ జిల్లా కేంద్రం కార్వారలో ఏ ముఖ్యమంత్రైనా పర్యటిస్తే ఆ తరువాత పదవి ఊడిపోయడం ఖాయమని చెబుతారు. అందుకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఉదాహరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కార్వారకు వెళ్లాల్సిన సీఎం యడియూరప్ప హఠాత్తుగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. దీనిని బట్టి ప్రజల కన్నా పదవే ముఖ్యమని యడియూరప్ప అధికారం కోసం పాకులాడుతున్నట్లు స్పష్టం అవుతోందని కార్వార కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.
సీఎం పర్యటన రద్దు ఇలా…
గత శనివారం సీఎం కార్వారలో పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలంగా లేదని పర్యటన రద్దు చేసుకున్నారు. భారీ వర్షాలు కురిసిన అన్ని ప్రాంత్లాలో సీఎం హోదాలో ఆయన సందర్శించారు. అయితే కార్వారను అదే విధంగా పరిశీలించాల్సి ఉన్నా, పదవీ గండం భయంతో వెనకడుగు వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం వస్తారని జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. కారవారతో పాటు శిరసి, సిద్ధాపుర, కుమటె, అంకోలా, భట్కళ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ వెళ్లేందుకు వాతావరణం సరిగా లేదని రద్దు చేసుకున్నారు. సీఎం షెడ్యూల్ మార్చుకుని హెలికాప్టర్‌లో శివమొగ్గకు తరలివెళ్లారు. అక్కడి నుంచి హావేరికి వెళ్లారు.
ఇప్పటివరకు కార్వారలో సీఎంల పర్యటన తరువాత ఏర్పడిన పదవీచ్యుత వివరాలు…
- 2005 నవంబరులో అప్పటి సీఎం ధరంసింగ్ కార్వారలో పర్యటించారు. తరువాత రెండు నెలలకు సంకీర్ణ జేడీఎస్‌తో మైత్రి తెగిపోవడంతో సీఎం పదవిని కోల్పోయారు.
- 2010 నవంబరు 19న అప్పటి సీఎం యడియూరప్ప కార్వారలో అడుగుపెట్టారు. 2011 ఆగస్టులో ఆయన అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడంతో పదవీచ్యుతులయ్యారు.
- 2012 ఫిబ్రవరిలో సీఎం సదానందగౌడ కార్వార పర్యటన అనంతరం అదే ఏడాది జూలైలో సీఎం పదవికి దూరమయ్యారు. పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా జగదీశ్ శెట్టర్ సీఎం అయ్యారు.
- 2013 జనవరిలో అప్పటి సీఎం జగదీశ్ శెట్టర్ కారవారలో పర్యటించారు. అదే ఏడాది మే నె లలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో మాజీ అయ్యారు.
- 2018 ఫిబ్రవరిలో సీఎం సిద్ధరామయ్య కార్వార వెళ్లారు, మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ఇంటిదారి పట్టారు.
- 2019 ఏప్రిల్ 4న సీఎం కుమారస్వామి కార్వారను సందర్శించారు. జూలైలో అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో బలపరీక్షలో విఫలమై అధికారానికి దూరమయ్యారు.
– కేశవ