టీడీపీ హయాంలో భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చిన రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో తమ త్యాగాలను వృథా చేస్తారా? అంటూ.. ఇక్కడి ప్రజలు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇప్పటికి 187 రోజులుగా వారు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఏమైందో ఏమో.. జగన్ అనూహ్యంగా తన మనసు మార్చుకున్నారట! ఇన్నాళ్లుగా అమరావతి ప్రజలు `మమ్మల్ని పట్టించుకోండి.. పట్టించుకోండి..“ అంటున్న నేపథ్యంలో జగన్ వారిని కూడా పట్టించుకుంటున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు.
ఈ క్రమంలోనే అమరావతిపై జగన్ మనసు మార్చుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా గడిచిన రెండు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలను, రోడ్లను ఆయన పరిశీలిస్తున్నారు. అధికారుల నుంచి వాటి పై వివరణ తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో అసలు ఏం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. తన మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే, అమరావతి విషయంలో ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకున్నారు.
అమరావతిని ఎలాగూ.. శాసనసభ రాజధానిగా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన కరకట్ట రహదారి(ప్రస్తుతం సిం గిల్ రోడ్డు) 14 కిలో మీటర్లను త్వరలోనే ఆరు లేన్ల అతి పెద్ద రహదారిగా విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబందించిన ప్లాన్ సిద్ధం చేసే బాధ్యతలను మంత్రి బొత్సకు అప్పగించారని అంటున్నారు. ఈ క్రమంలోనే బొత్స అక్కడ పర్యటిస్తున్నారు. అదేసమయంలో రైతులకు కట్టిస్తా మని చెప్పిన ఇళ్లు, అభివృద్ధి చేస్తామని చెప్పిన స్థలాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకు న్నారు. తద్వారా.. ప్రస్తుతం వెల్లువెత్తుతున్న విమర్శలకు పక్కాగా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
అయితే, తన కలల ప్రణాళికలైన మూడు రాజధానుల విషయంలో జగన్ ఎక్కడా రాజీ పడాలని భావించడం లేదు. విశాఖనే ప్రధాన పాలనా రాజధానిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనికి ముందుగానే అమరావతిని ఓ కొలిక్కి తెచ్చి.. ఇక్కడ ప్రజల ఆవేదనను తగ్గించడం ద్వారా.. తాను చేయాలనుకున్న పనులు చేయాలని జగన్ భావిస్తున్నారనే ప్రచారం వైసీపీలో జరుగుతోంది. ఇది సక్సెస్ అయితే.. ఈలోపే.. మండలి రద్దు కూడా అయిపోతే.. ఇక, అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల అంశాన్ని చర్చించి కార్యరూపంలోకి తేవాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఫలిస్తాయనే అంటున్నారు వైసీపీ నాయకులు.