తెలంగాణ రాష్ట్ర మందు బాబులకు బిగ్ అలర్ఠ్. 25వ తేదీ నుంచి 3 రోజులు వైన్స్ బంద్ అంటూ ప్రకటన చేశారు కమిషనర్ సుధీర్ బాబు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ పరిధిలో 25 వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 27వ తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులు, రెస్టారెంట్లు, హోటల్లు, క్లబ్బులు మరియు ఇతర అన్ని రకాల మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968, సెక్షన్ 20, ప్రకారం కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు.
డ్రై డే ఆదేశాలు అమలులో ఉన్న ఈ రెండు రోజులలో సాధారణ మద్యం షాపులతోపాటు ఇతర రకాల మద్యం అమ్మకాలకు లైసెన్సులు పొందిన వారు కూడా ఎటువంటి అమ్మకాలు లేదా సర్వ్ చేయడం జరపకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిపే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉండడం వల్ల ఎటువంటి మద్యం అమ్మకాలూ జరగకుండా అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.