కరోనా నేపథ్యంలో గత 6 నెలల నుంచి అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్నో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక మందికి ఉపాధి కరువైంది. అయితే ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ చెబుతున్న లెక్కల ప్రకారం గత సెప్టెంబర్ నెలలో కంపెనీలు ఉద్యోగాలిచ్చే రేటు పెరిగిందని వెల్లడైంది. అంటే కరోనా వల్ల తొలగించిన ఉద్యోగులను మళ్లీ నియమించుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ఉద్యోగాలిచ్చే రేటు 24 శాతం పెరిగిందని నౌక్రి తెలియజేసింది.
ముఖ్యంగా ఫార్మా, ఫాస్ట్ మూవింగ్ కన్‌జ్యూమర్ గూడ్స్, ఎడ్యుకేషన్, ఐటీ తదితర రంగాల్లో మళ్లీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని నౌక్రి తెలిపింది. అలాగే రియల్ ఎస్టేట్, ఆటో, హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాల్లోనూ ఉద్యోగాల సంఖ్యలో వృద్ధి కనిపిస్తుందని పేర్కొంది. బీపీవో, ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్ రంగాలు కూడా నెమ్మదిగా వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపింది.
కాగా గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే గత సెప్టెంబర్ నెలలో ఉద్యోగాలిచ్చే రేటు 23 శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఆగస్టు నెలతో పోలిస్తే ఆ రేటు పెరిగిందని వెల్లడైంది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయినప్పటికీ సెప్టెంబర్ నెలలో చాలా మందికి తిరిగి ఉద్యోగాలు లభించాయి. గత కొద్ది నెలలుగా 35 నుంచి 60 శాతం వరకు తగ్గిన ఉద్యోగాలిచ్చే రేటు ఇప్పుడు నెమ్మదిగా రికవరీ అవుతుందని నౌక్రి వెల్లడించింది.
ఇక కంపెనీలు 8 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్నవారిని ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు వెల్లడైంది. వీరి శాతం 27 గా ఉంది. అలాగే 0-3 ఏళ్ల అనుభవం ఉన్నవారిని 25 శాతం, 4-7 ఏళ్ల అనుభవం ఉన్నవారిని 23 శాతం, 13-16 ఏళ్ల ఉద్యోగానుభవం ఉన్నవారిని 24 శాతం, 16 అంతకన్నా ఎక్కువ ఏళ్ల అనుభవం ఉన్నవారిని 19 శాతం వరకు కంపెనీలు నియమించుకుంటున్నాయని తేలింది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయినప్పటికీ సెప్టెంబర్ నెల నుంచి ఆశావహ పరిణామాలు నెలకొన్నాయని నౌక్రి తెలియజేసింది.