పార్టీ ఒకటే.. జెండా ఒకటే.. వారందరి నాయకుడు కూడా ఒకరే..! కానీ, ఆ నాయకులు అజెండాలు వేరు. వారి వ్యూహాలు వేరు. వారి వారి పనులు వేర్వేరు. దీంతో అత్యంత కీలకమైన కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. జిల్లాలో రెండు ఎంపీ స్థానాలున్నాయి. ఒకటి టీడీపీ గెలుచుకుంది. మరొకటి వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అదేవిధంగా కృష్ణాలో ఒక్క విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. రాజధానికి సమీపంలో ఉండి టీడీపీకి కంచుకోట లాంటి ఈ జిల్లాలో పార్టీకి ఇంత మెజారిటీ ఉన్నప్పటికీ.. వైసీపీలో అంతర్గత కలహాలతో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది.
ఒకరంటే ఒకరికి పడడం లేదు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తన మానాన తను పనిచేసుకుపోతున్నారు. అయితే, తన నియోజకవర్గం పరిధిలో.. ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లాలన్న స్పృహ ఆయనలో ఎక్కడా కనిపించడం లేదన్న చర్చలు నడుస్తున్నాయి. ఇక, విజయవాడ టీడీపీ ఎంపీ నానికి, స్థానిక ఎమ్మెల్యేలకు పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఉంది. పైగా విజయవాడలోనూ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు (వీరిలో ఒకరు మంత్రి) ఉన్నా.. వారిలో వారికే కలహాలు కాపురం చేస్తున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యేకి, గుడివాడ ఎమ్మెల్యే కమ్ మంత్రి నానికి కూడా పడడం లేదు. పామర్రు ఎమ్మెల్యే తన పనేదో తాను చేసుకుంటున్నారు తప్ప.. పక్కనే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి నానిని పట్టించుకోవడం లేదట.
ఇక, నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే తనను పార్టీ దూరం పెట్టిందనే బాధతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ఎక్కడా యాక్టివ్‌గా కనిపించడం లేదు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేనిది మరో స్టయిల్. అంతా తనకే చెప్పి చేయాలని కొందరు నేతలపై ఆయన చేస్తున్న ఒత్తిడి పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. ఇక, తిరువూరు ఎమ్మెల్యే ఫుల్ సైలెంట్. ఎవరితోనూ మాట్లాడరు. ఎవరు మాట్లాడినా.. నాదేముంది అన్నను అడగండి(సామినేని)అని పెదవి విరుస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే తీరు మరో విధంగా ఉంది. పట్టుబట్టి గెలుపు గుర్రం ఎక్కి.. మంత్రి దేవినేనిని ఓడించాను. అయినా నాకు ప్రాధాన్యం లేదని వసంత కృష్ణ ప్రసాద్ వాపోతున్నారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్.. మంత్రికాని మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.