సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ సీనియర్లకు ఠాగూర్ తో పూర్తిగా చెడిందా ?

-

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పూర్తిస్థాయిలో ఎఫర్ట్‌ పెట్టారు. ముఖ్య నాయకులంతా ఫీల్డ్‌లోకి దిగిపోయారు. ఇన్నాళ్లూ స్థానిక నాయకులతో ప్రచారం నడిపించిన జానారెడ్డి సైతం.. టీఆర్‌ఎస్‌ వ్యూహానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. అగ్ర నేతలంతా తమకు అప్పగించిన మండలాల్లో ప్రచారం స్పీడ్‌ పెంచారు. పార్టీకి చెందిన ముఖ్యనాయకులంతా కనిపిస్తున్నా… తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ తెర పై లేకపోవడంతో ఏం జరిగిందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది.

దుబ్బాక ఉపఎన్నిక తర్వాత తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా మాణిక్యం ఠాగూర్‌ అంతగా పట్టించుకోవడం లేదని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆయన ఇంఛార్జ్‌గా రాష్ట్రానికి వచ్చిన వెంటనే దుబ్బాక బైఎలక్షన్‌ స్వాగతం పలికింది. ఆ పోరులో స్థానిక నేతల అభిప్రాయాలను పక్కనపెట్టి అంతా ఆయన నాయకత్వంలోనే నడిపించారు. అంత చేసినా దుబ్బాకలో కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. పార్టీ పరువు పోయిందనేది కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొనే మాట. అసలు దుబ్బాకలో కాంగ్రెస్‌ కి సీన్ లేకపోయినా అంత ఎఫర్ట్‌ అవసరమా అని కొందరు కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర నాయకుల్లో కొందరితో ఠాగూర్‌కు గ్యాప్‌ వచ్చింది.

కొత్త పీసీసీ సారథి ఎంపిక ప్రక్రియ సైతం ఠాగూర్‌కు ఇతర పార్టీ నేతల మధ్య సంబంధాలను జటిలం చేసింది. దీంతో ఆయన గ్రేటర్ ఎన్నికలు లైట్‌ తీసుకున్నారని సమాచారం. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక జరుగుతోంది. ఒక్క రోజు వచ్చి సమీక్ష చేయలేదని పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొన్నటి వరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని సర్దుకుపోయినా.. అక్కడి ఎన్నికలు ముగిశాయి కదా.. అయినా ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారట. మధ్యలో ఓసారి జూమ్‌ మీటింగ్‌ పెట్టి మమ అనిపించారని కొందరు ఇంఛార్జ్‌పై గుర్రుగా ఉన్నాట్టు తెలుస్తోంది.

పీసీసీ కొత్త చీఫ్‌ ఎంపిక సమయంలో పార్టీలో ఓ ముఖ్య నాయకుడి అభిప్రాయాలను ఠాగూర్‌ తీసుకోలేదట. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగిందట. ఆ గొడవ మేడమ్‌ సోనియాగాంధీ వరకు వెళ్లినట్టు సమాచారం. రాహుల్‌ గాంధీకి దగ్గర మనిషి అని అనిపించుకున్న ఠాగూర్‌.. ఇక్కడి నాయకులను తక్కువ అంచనా వేశారనే విమర్శలు ఉన్నాయి. మేడం దగ్గర ఇదే విషయమై పేచీ నడిచిందట. చివరకు తత్వం బోధపడిందో ఏమో ఠాగూర్‌ కామైపోయారు. ఎన్నికలను స్థానిక నాయకులకే అప్పగించేస్తున్నారట. సాగర్‌లో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇంఛార్జ్‌ ఠాగూర్‌ అసలు వస్తారా ఇక అంతేనా అన్న చర్చ నడుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news