హస్తినలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా కొనసాగుతోంది. రెండో రోజు మురళీధర్ అధ్యక్షతన కాంగ్రెస్ వార్ రూంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం సాగుతోంది. కొత్తగా నియమితులైన సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ నిన్న, ఇవాళ ప్రధానంగా బీసీ టికెట్ల అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. గతంలో హామీ ఇచ్చినట్టుగా 34 సీట్లను బీసీలకు కేటాయించాలని మధుయాష్కీ గౌడ్ పట్టుబడుతున్నారు. అయితే 14 నుంచి 15 సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం బీసీలకు 34 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో తొలిజాబితా వెలువడుతుందని సమాచారం. 35 మంది పేర్లను వెల్లడిస్తారని ప్రచారం జరుగుతుండగా.. అన్ని సీట్లను ఒకే సారి ప్రకటిస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. టికెట్ల ఆశిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే తమ తమ చానల్స్ ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
అంతేకాదు.. టికెట్ కేటాయింపులపై వార్ రూంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వాడీవేడి వాదనలు జరిగినట్లు సమాచారం. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా ఈ అభ్యర్థులను ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కీలక నేతలంతా పాల్గొన్నారు.