మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హీరా పన్నా మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంధేరీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం, మధ్యాహ్నం 3:15 గంటలకు మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, కొంతమంది మాల్‌లో చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, షాపింగ్ కాంప్లెక్స్‌ను వెంటనే ఖాళీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 12 ఫైర్ ఇంజన్లతో సహా 25 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.. బీఎంసీతోపాటు ఫైర్ అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు హీరా పన్నా మాల్‌లో భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.