గ్రేటర్ లో కాంగ్రెస్ షాక్!
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన విజయనగర్ కాలనీ డివిజన్ అభ్యర్థి ఫాతిమాపై ఛీటింగ్ కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ పొందారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు అందజేసి బీసీ ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం నుంచి బీసీ ఈ సర్టిఫికెట్ పొందారని అధికారులు ధ్రవీకరించారు. స్వయంగా ముషీరాబాద్ తహసీల్దార్ జానికీ ఈ విషయంపై ఈసీతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫాతిమాపై 420, 468,470 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫాతిమా నివాసముండేది నాంపల్లి ఏరియాలో.., ఆమె అక్కడి కార్యాలయం నుంచి మాత్రమే బీసీ ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉండగా, ఏకంగా ముషీరాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ నుంచి బీసీ ఈ సర్టిఫికెట్ పొందారు. దీనిపై పలు రాజకీయ పార్టీలు రచ్చ రచ్చ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై స్పందించలేదు. ఈ వ్యవహారంలో ఫాతిమాకు బీసీ ఈ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.