ఎన్డీఏ హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిందని, జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్ రూఫ్ కూలిందని, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ కనోపీ ధ్వంసమైందని వివరించారు. అయోధ్యలో రహదారుల పరిస్ధితి దారుణంగా ఉందని, రామ్ మందిర్‌లో లీకేజీలు, ముంబై హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు చోటుచేసుకున్నాయని చెప్పారు.
బిహార్‌లో మూడు వంతెనలు కుప్పకూలగా, ప్రగతి మైదాన్ టన్నెల్ నీటి మునిగిందని తెలిపారు.ఈ నిర్మాణాలన్నీ ఎన్డీయే హయాంలో చేపట్టినవేనని వెల్లడించారు. వారి పాలనలో ప్రతి భవనం కూలిపోయే ముప్పు కలిగిఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఎన్నికల బాండ్ల స్కామ్ అని, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని కేసీ వేణుగోపాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను ప్రభుత్వం రికార్డుల నుంచి తొలగించడంపై విపక్ష నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు.