కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 52వేల మందికి పైగా కరోనా సోకగా.. 1783 మంది చనిపోయారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నిత్యం పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతుండడం.. అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక కరోనా ప్రభావం ఇప్పుడు తక్కువగా ఉండవచ్చు కానీ.. జూన్, జూలై నెలల్లో ఆ వైరస్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య కన్నా ఆ నెలల్లో కరోనా కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆ నెలల్లో కరోనా పీక్స్‌కు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.
ఇప్పటి వరకు తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించగా.. కరోనా ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం ఏ మాత్రం లేదని, జూన్, జూలై నెలల్లో వైరస్ ప్రభావం తారా స్థాయికి చేరుకుంటుందని అన్నారు. అయితే అప్పటి పరిస్థితులకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.