ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది మృత్యువాత పడగా, లక్షల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎందరో బలి అవుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. మరోపక్క ఈ కరోనా మరింత ప్రబలుతుంది అని మరింత ప్రాణనష్టం తప్పదు అంటూ వస్తున్న వార్తలు కూడా జనాలలో భయాందోళన కలిగిస్తుంది. అయితే ఈ మహమ్మారి త్వరలోనే తగ్గుముఖం పడుతుంది అంటూ 2013 లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత,జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేస్తున్నారు. రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్-19 త్వరలోనే శాంతిస్తుంది. చైనాలో దీని బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య తగ్గిన తరహాలోనే ప్రపంచ దేశాల్లోనూ కరోనా తోక ముడుస్తుంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఇది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం కంటే ముందే జరుగుతుంది అని లెవిట్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులపై ఈ ఏడాది జనవరి నుంచే నిశితంగా అధ్యయనం చేసి ఈ విషయాన్నీ వెల్లడించినట్లు తెలుస్తుంది.
దీనిని తరిమికొట్టాలంటే.. ప్రపంచ దేశాలు భయాందోళనలను అధిగమించాలని, సామాజిక దూరం పాటిస్తే చాలు అని ఆయన సూచిస్తున్నారు. కోవిడ్-19తో 3,250 మరణాలు సంభవిస్తాయని లెవిట్ ఫిబ్రవరిలోనే అంచనా వేయగా సరిగ్గా చైనా లో అదే సంఖ్య లో మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన అంచనాల ప్రకారం గనుక కరోనా తగ్గుముఖం పడితే మాత్రం ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటాయి.