కోనసీమలో కరోనా కలకలం మొదలయ్యింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అమలాపురం డివిజన్ పరిధిలో 10 పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఒక సిఐ, ఐదుగురు ఎస్ ఐ లకు మరియు నలుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసులు కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులలో పాల్గొన్నట్టు సమాచారం. కరోనా సోకిన పోలీసులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
కరోనా సోకిన పోలీసు సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని డిఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాము.. ఎవరికీ సీరియస్ గా లేదు..కంగారు పడాల్సిన అవసరం లేదని డిఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. దాంతో మాస్కులు కరోనా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు.