క్రీస్తు దయతో కరోనా తగ్గింది..వివాదాల డీహెచ్.!

-

తెలంగాణ హెల్త్ డైరక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు వివాదాల చుట్టూనే తిరుగుతున్నారు. మరి కావాలని చేస్తున్నారా? లేక ఫ్లోలో వివాదాల్లో చిక్కుకుంటున్నారో తెలియదు గాని..ఎప్పుడు ఏదొక వివాదం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆ మధ్య సీఎం కేసీఆర్ కాళ్ళపై పడటం పెద్ద వివాదమైన విషయం తెలిసిందే. ఓ అధికారి అయి ఉండి..సీఎం కాళ్ళు మొక్కడం ఏంటని విమర్శలు వచ్చాయి.

ఇక ఈ విమర్శలని డి‌హెచ్ సమర్ధించుకున్నారు కూడా…తండ్రి సమానులైన కేసీఆర్ కాళ్ళు మొక్కడంలో తప్పు లేదని, అవసరమైతే వందసార్లు కాళ్ళు మొక్కుతానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే కొందరు అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు సైతం రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని, కేసీఆర్ అనుగ్రహం కోసం కాళ్ళు మొక్కుతున్నారని విమర్శలు వస్తున్నాయి.  ఈయన కొత్తగూడెం సీటు కోసం ట్రై చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

ఈ వివాదం ముగిసిందనుకునే లోపే డి‌హెచ్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గిందని చెప్పి మాట్లాడారు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో శ్రీనివాసరావు ఓ కార్యక్రమానికి వెళ్ళి ఈ వ్యాఖ్యలు చేశారు. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయట పడలేదని, ఏసుక్రీస్తు కృప, దయవల్లే  కరోనా తగ్గిందని ఛేప్పుకొచ్చారు. ఇక డి‌హెచ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

అయితే ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాను ఆ మాటలు అనలేదని చెప్పుకొచ్చారు. కొన్ని మీడియా సంస్థలు తన ప్రసంగంలోని మాటలని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని ప్రెస్ నోట్ వదిలారు. క్రీస్తు వల్లే కరోనా తగ్గిందని తాను మాట్లాడినట్లు ఎడిట్ చేశారని, యూట్యూబ్‌లో ఉన్న తన ఫుల్ వీడియోని చూస్తే తాను మాట్లాడినా మాటలు స్పష్టంగా ఉంటాయన్నారు. మొత్తానికి డి‌హెచ్ మాత్రం ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటూనే ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news