అమెరికాకు చెందిన పరిశోధకులు ఓ రోబోను సృష్టించారు. ఆసుపత్రిలో ఉన్న రోగుల వైరస్ లక్షణాలను రిమోట్ ఆధారంగా ఇది గుర్తిస్తుంది. ముఖ్యంగా కోవిడ్-19 లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి ఇతర వైరస్ సంకేతాలను పసిగట్టి ఇన్ఫెక్షన్‌ను తగ్గించేలా తోడ్పడుతుంది. బోస్టన్ డైనిమిక్స్ వారు ఈ రోబోకు నాలుగు కెమేరాలను సెట్ చేశారు. చూసేందుకు కుక్క లాగా ఉన్న ఈ రోబో రిమోట్ ఆధారంగా పనిచేస్తుంది. డాక్టర్లు-రోగులు ఒకే గదిలో ఉండాల్సిన పని లేదు. ఈ రోబోను ట్యాబ్లెట్లకు (ట్యాబ్) అనుసంధించుకుని బాధితుల లక్షణాల్ని తెలుసుకోవచ్చు.
ఈ పరిశోధన వివరాల్ని ప్రీప్రింట్ సర్వర్ టెక్ రిక్సివ్ ప్రచురించింది. దీని గురించి శాస్త్రజ్ఞులు లేదా వైద్య నిపుణుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ వార్తా కథనం ప్రకారం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), బోస్టన్ డైనమిక్స్, బ్రిగ్హామ్ ఉమెన్స్ ఆసుపత్రి వారు ఈ రోబోటిక్ ప్లాట్‌ఫామ్ రూపొందించినట్లు తెలిపింది. వైరస్ లక్షణాలైన (వైటల్ సైన్స్) శరీర ఉష్ణోగ్రత, శ్వాస రేటు, పల్స్ రేటు, బ్లడ్-ఆక్సిజన్ శ్యాచురేషన్ లాంటి వాటిని రెండు మీటర్ల దూరం నుంచే పక్కగా అంచనా వేస్తుంది. ఈ బృందం ప్రస్తుతం కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న రోగులలో రోబో సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.