ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఎవరి దగ్గరి నుండి ఎలా వ్యాపిస్తుందే ఎవరికీ తెలియడం లేదు. ఇక వైరస్ ప్రభావం జంతువులపై ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. కుక్కలు, పిల్లులు వైరస్ ను వ్యాప్తి చేయగలవని తాజా పరిశోధనలో తేలింది. ఇక పెంపుడు జంతువులతో బయటకు వెళ్లడం వల్ల కరోనా వైరస్ సోకే అవకాశం 78 శాతం వరకు పెరుగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. కిరాణా సామాన్లను ఇంటికి డెలివరీ చేయించుకోవడం వల్ల వైరస్ ముప్పు రెట్టింపు అవుతుందట.
పెంపుడు జంతువులైన కుక్కలను బయటకు తీసుకెళ్లిన యజమానులు వైరస్ బారిన పడకుండా పరిశుభ్రతలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ఇంటికి వచ్చాక స్నానం చేయాలని చెప్పారు. స్పెయిన్ లోని 2,086 మందిపై ఈ సర్వే చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరిలో 98 మందికి, అంటే 4.7శాతం మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. బయటి వాతావరణంలో ఉండే వైరస్ కుక్కల ద్వారా యజమానులకు వ్యాపించగలదు. వైరస్ వ్యాప్తికి కుక్కలు వాహకాలుగా పనిచేస్తాయి. కానీ ఎన్ని జంతువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందనే వివరాలపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. గతంలో కుక్కలు, పిల్లులకు వైరస్ సోకినట్లు నిర్ధారించినా, వాటిలో ఎలాంటి అనారోగ్య సమస్యలను పరిశోధకులు గుర్తించలేదు.
అయితే మనుషుల్లో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లుగా.. కుక్కల ద్వారా వైరస్ సోకుతుందా లేదా బయట వాతావరణంలో ఉండే వైరస్ కుక్కల శరీరంపై చేరి మనుషులకు సోకుతుందా అనే వివరాలపై స్పష్టత లేదని ప్రొఫెసర్ గొంజాలెజ్ వివరించారు. ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్లేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిశుభ్రతను పాటించడం వల్ల వైరస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని గొంజాలెజ్ పేర్కొన్నారు.