యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు మంకీపాక్స్ వైరస్‌లు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. అయితే తాజాగా
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 771 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5733కి ఎగబాకింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 289, రంగారెడ్డి జిల్లాలో 53, పెద్దపల్లిలో 49, మేడ్చల్‌లో 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33, కరీంనగర్‌లో 31, నల్గొండ జిల్లాలో 28, సిద్దిపేట జిల్లాలో 27, మంచిర్యాల జిల్లాలో 21, జనగామ జిల్లాలో 18, నిజామాబాద్ జిల్లాలో 16, సిరిసిల్ల జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12, కామారెడ్డి జిల్లాలో 12 సంగారెడ్డి జిల్లాలో 11, హన్మకొండ జిల్లాలో 11 కేసులు నిర్ధారణ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,320 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,733 కేసులు ఉండగా.. వీరిలో 233 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. వీరిలో 39 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 100 మంది ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్నారని వెల్లడించింది. మిగిలిన వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స మెడిసిన్ తీసుకుంటున్నారని తెలిపింది.