అమెరికాలో నవంబర్ 3వ తేదీ అధ్యక్ష ఎన్నికల కన్నా చాలా ముందుగానే కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధ్యక్షుడు డొనాల్ఢ్ ట్రంప్ అన్నారు. గెరాల్డో రివెరా రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ వరకు ఆగాల్సిన పనిలేదని, అంతకన్నా ముందుగానే కరోనా వ్యాక్సిన్ అమెరికా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ట్రంప్ అన్నారు. అయితే దీన్ని అధ్యక్ష ఎన్నికల కోసం చేయట్లేదని, వీలైనంత మంది ప్రజలను రక్షించాలన్నదే తన అభిమతమని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా అమెరికాలో సగటున రోజుకు 1వేయి మందికి పైగా కరోనా వల్ల చనిపోతున్నారు. అందువల్లే వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇక అమెరికా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రతినిధి డాక్టర్ డాక్టర్ ఆంథోని ఫాసీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయని, అయితే వాటిలో కొన్ని ఫెయిల్ అయినా.. కొన్ని సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించారు.
ఇక రష్యా దేశం మరో 2 రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ప్రజా పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 10 నుంచి అక్కడ కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లో ప్రజలకు లభ్యం కానుంది. మొదటగా అక్కడ అత్యవసర సేవలను అందించే సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.