చైనా దేశంలోని వూహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారని ఇప్పటికీ అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇదే నిజమని అంటున్నాయి కూడా. ఇక కరోనాను ల్యాబ్‌లో సృష్టించలేదని, అది గబ్బిలాల నుంచి వచ్చి ఉంటుందని కొందరు అన్నారు. కొందరేమే పంగోలిన్లు (అలుగు) కరోనాను వ్యాపింపజేశాయని అన్నారు. అయితే పలువురు సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాలు మాత్రం మరో కొత్త విషయాన్ని వెల్లడించాయి. అసలు కరోనా వైరస్ ఇప్పుడు పుట్టింది కాదని, ఎన్నో సంవత్సరాల నుంచే ఆ వైరస్ గబ్బిలాల్లో ఉంటుందని తేల్చారు.
గబ్బిలాల్లో ఎన్నో సంవత్సరాల కాలం నుంచే కరోనా వైరస్ ఉందని సైంటిస్టులు గుర్తించారు. హార్స్ షూ అనే జాతికి చెందిన గబ్బిలాల్లో కరోనా ఉందని తేల్చారు. అందువల్ల గబ్బిలాలనే కరోనా వైరస్‌కు మూలమని కూడా వారు భావిస్తున్నారు. ఈ వివరాలను పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. ఇవే వివరాలను నేచర్ మైక్రో బయాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
కరోనా వైరస్ కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాల్లో ఉందని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా మూలాలను కనిపెడితే దాన్ని అంతమొందించడం సులభతరమవుతుందని, ఆ వైరస్ మనుషులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చని అంటున్నారు. అయితే గబ్బిలాల్లో అసలు ఆ వైరస్ ఎలా వచ్చింది అనే విషయాన్ని ప్రస్తుతం వారు తెలుసుకుంటున్నారు. ఇక పంగోలిన్ల నుంచి వైరస్ మనుషులకు వ్యాప్తి చెందింది అని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవన్నారు. గబ్బిలాల నుంచే ఆ వైరస్ మనకు వ్యాప్తి చెంది ఉంటుందని అంటున్నారు. అలాగే వాటి నుంచే పంగోలిన్లకు కూడా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో అసలు కరోనా ముందుగా ఎక్కడ, ఎలా ఉద్భవించిందో సైంటిస్టులు తెలసుకోనున్నారు.