ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మొదట చైనాలో ఉద్భవించిందని ఇప్పటికీ చాలా దేశాలు, ప్రజలు నమ్ముతున్న విషయం విదితమే. అయితే ది లాన్సెట్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ సహజంగానే ఉద్భవించిందని, ల్యాబ్లో లీకవ్వలేదని తేలింది. ఈ మేరకు సైంటిస్టులు తాజాగా వివరాలను వెల్లడించారు.
బోస్టన్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, యూకేకు చెందిన ది వెల్కమ్ ట్రస్ట్, బెర్లిన్లోని చారైట్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్కు చెందిన సైంటిస్టులతోపాటు పలువురు బయాలజిస్టులు, ఎకాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, వైద్య నిపుణులు, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్, వెటర్నరీ వైద్య నిపుణులు కలిసి సదరు అధ్యయనాన్ని కూలంకషంగా పరిశీలించారు. ఆ తరువాతే పై వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, అది సహజంగానే ఉద్భవించిందని అన్నారు.
అయితే గబ్బిలాల నుంచి మనుషులకు వైరస్లు వ్యాప్తి చెందుతాయనే అంశం బలంగా వినిపిస్తుంది కనుక దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో భవిష్యత్తులో వచ్చే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు కావల్సినంత విజ్ఞానం లభిస్తుందని అన్నారు. అయితే ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే కోవిడ్ విషయంలో చైనాను దోషిగా చూశాయి. మరి ఈ కొత్త అధ్యయనం ప్రకారం ఆయా దేశాలు ఏమంటాయో చూడాలి.